హరివిల్లు (Joyful Learning)
పాఠశాలలో కొత్త కథ ఏం చెప్తారు? కొత్త కృత్యం ఏం చేయిస్తారు? అని ఆలోచిస్తూ విద్యార్థి నిద్రపోవాలి. అలాగే ఈ రోజు చెప్పబోయే కథలు, కృత్యాలు ఎంత ఉత్సాహభరితంగా ఉంటాయో, ఎంత త్వరగా పాఠశాలకు వెళతానా అనే ఆలోచనతో నిద్రలేవాలి.
పిల్లల చదువు ఆడుతూ పాడుతూ సాగాలని మన అందరి కోరిక. కానీ దానికి కావలసిన సాధనా సంపత్తులు ఏర్పరచుకోవటంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది ఉపాధ్యాయ సోదరులు భావిస్తున్నారు. మరికొంత మంది ఉపాధ్యాయులు వారి వారి ప్రయత్నాలతో విజయం సాధిస్తూనే ఉన్నారు. అలా విజయం సాధించిన వారి అనుభవాల ఆధారంగా అవసరమైన సూచనలు, కథలు, కృత్యాలు, నమూనాలు నిపుణుల పర్యవేక్షణలో ఏర్చి కూర్చటం జరిగింది. ఇది ఉపాధ్యాయులకు ఒక దారి దీపంగా ఉపయోగపడుతుందని, ఈ బాటలో ఉపాధ్యాయులు సరికొత్త ప్రయోగాలు చేసి విజయం సాధిస్తారని మా నమ్మకం. భవిష్యత్తులో అభ్యసన ప్రక్రియ మరింత ఆనందదాయకంగా ఉండేలా చేయడంలో మీ అనుభవం మీ పాత్ర చాలా కీలకం కావాలన్నదే మా ఆకాంక్ష.
బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా విద్యార్థులలో పెంపొందించవలసిన తొమ్మిది విలువలలో ప్రేరణ&కరుణ (Love& Compassion), గౌరవం (Respect), కృతజ్ఞత (Gratitude), ఐక్యత (Unity), ధైర్యం (Courage), నమ్మకం (Trust), నిజాయితీ (Truthful) అనే విలువలపై మాత్రమే ఈ సంవత్సరం ఈ పుస్తకం తయారు చేయటం జరిగింది. మిగిలిన విలువలపై కాలక్రమంలో కరదీపికలు వెలువరించటం జరుగుతుంది.
హరివిల్లు అనే ఈ పుస్తకం ద్వారా ఆనందాత్మక విద్యాభ్యాసన ప్రక్రియను ప్రయోగాత్మకంగా వికారాబాద్, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గత సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సోమవారం మానసిక సంసిద్ధత (Mindfulness); మంగళ, బుధ వారాలలో కథలు (Stories); గురు, శుక్ర వారాలలో కృత్యాలు (Activities); చివరగా శనివారం రోజున ఒకటి, రెండు తరగతులకు సమన్వయ కృత్యాలు (Milling Activities level 1); మూడు నుండి ఐదు తరగతులకు తమను తాము వ్యక్తపరచుకోవటం (Expressions) కాలాంశాలుగా విద్యార్థుల స్థాయి భేదాన్ని బట్టి రూపొందించడం జరిగింది.
ఉపాధ్యాయులందరూ ఈ కరదీపికను ఉపయోగించుకుని అభ్యసన ప్రక్రియను విద్యార్థులకు మరింత ఆనందదాయకంగా ఉండేలా తీర్చిదిద్దుతారని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు ఒక ఆకర్షణ కేంద్రంగా పాఠశాల ఉండాలని ప్రభుత్వ ఆకాంక్ష. ఈ దిశలో ఉపాధ్యాయులకు ఈ పుస్తకం ఒక సాధనంగా ఉపయోగపడుతుందని, ప్రభుత్వం ఆశిస్తోంది. భవిష్యత్తులో మరింత ఉపయుక్తంగా ఉండేలా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దటంలో సూచనలు, సలహాలను విద్యావేత్తల నుండి, ఉపాధ్యాయుల నుండి ఆహ్వానిస్తున్నాం.
0 comments:
Post a Comment